India: పాకిస్థాన్ వక్రబుద్ధి.. భారత ఆర్మీ పోస్టులు, గ్రామాలపై బుల్లెట్ల వర్షం!

  • ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కాల్పులు
  • దీటుగా తిప్పికొడుతున్న భారత సైన్యం
  • భారత్ లోకి ఉగ్ర చొరబాట్లు జరుగుతాయని అనుమానం

దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించుకుంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే సరిహద్దులో భారత పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించింది. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో సుందర్బనీ, నౌషేరా సెక్టార్లలో భారత ఆర్మీ పోస్టులు, గ్రామాలు లక్ష్యంగా తేలికపాటి ఆయుధాలు, మెషీన్ గన్లతో బుల్లెట్ల వర్షం కురిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ పాక్ కాల్పులను దీటుగా తిప్పికొడుతోంది.

భారత్ లోకి చొరబడేందుకు పాక్ 230 మంది ఉగ్రవాదులను సరిహద్దు వద్ద మోహరించిందని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న చెప్పారు. వీరిని భారత్ లోకి జొప్పించడం ద్వారా కశ్మీర్ లో అలజడి సృష్టించాలని పాక్ కుట్ర పన్నుతోందని వెల్లడించారు. సాధారణంగా పాక్ కాల్పులు జరపడం ద్వారా భారత బలగాల దృష్టిని మళ్లిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఉగ్రవాదులు సులభంగా కశ్మీర్ లోకి చొరబడుతూ ఉంటారు. తాజాగా పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత్ లోకి పంపేందుకే ఈ కాల్పులకు తెరలేపిందని పలువురు రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News