Robert Mugabe: జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత!

  • సింగపూర్ లో చికిత్స పొందుతూ మృతి
  • 1980-2017 మధ్య పాలించిన ముగాబే
  • ముగాబే పాలనలో అల్లాడిపోయిన ప్రజలు
ఆఫ్రికా దేశమైన జింబాబ్వేకు 1980 నుంచి 2017 వరకూ సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన రాబర్ట్ ముగాబే (95) ఈరోజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మనంగ్వా ప్రకటించారు. 1924, ఫిబ్రవరి 21న ముగాబే బ్రిటిష్ పాలనలోని రొడీషియా(ప్రస్తుత జింబాబ్వే)లో జన్మించారు.

దక్షిణాఫ్రికాలోని ఫోర్ట్ హార్ విశ్వవిద్యాలయం నుంచి స్కాలర్ షిప్ అందుకున్నారు. ఏడు డిగ్రీలు అందుకున్న అనంతరం ఘనాలో ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. అక్కడే ఘనా నేత కామే క్రుమా ఆలోచనలతో తీవ్రంగా ప్రభావితులయ్యారు. 1960లో స్వదేశానికి తిరిగొచ్చిన ముగాబే, మరికొందరితో కలిసి జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్(జానూ) పార్టీని స్థాపించారు. 1964లో జింబాబ్వే ప్రధాని ఇయాన్ స్మిత్, ఆయన ప్రభుత్వాన్ని ‘కౌబాయ్’ లుగా అభివర్ణించడంతో ముగాబేను అరెస్ట్ చేసిన ప్రభుత్వం విచారణ జరపకుండానే పదేళ్లు జైలులో పెట్టింది.

1973లో విడుదలైన ఆయన మొజాంబిక్ కు వెళ్లిపోయారు. అక్కడి నుంచే గెరిల్లా పోరాటాలు నిర్వహించారు. చివరికి 1980లో ఎన్నికలు జరగ్గా ముగాబే ప్రధానిగా ఎన్నికయ్యారు. 1987లో ప్రధాని పదవిని రద్దుచేసి అధ్యక్ష పదవిని తనవద్దే అట్టిపెట్టుకున్నారు.

జింబాబ్వేలో ద్రవ్యోల్బణం దారుణంగా పెరిగినా, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. జింబాబ్వే ప్రజలు ఆకలితో అల్లాడిపోయేవారు. చివరికి ముగాబే పాలనతో విసుగు చెందిన ఆర్మీ ఆయనపై తిరుగుబాటు చేసింది. 2017లో గృహనిర్బంధంలో ఉంచింది. దీంతో జానూ పార్టీ ఉపాధ్యక్షుడు మనంగ్వా జింబాబ్వే అధ్యక్షుడయ్యాడు.
Robert Mugabe
Africa
Zimbabwe
prime minister

More Telugu News