గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం.. రెండు కార్లు, 10 ద్విచక్ర వాహనాలు దగ్ధం!

04-09-2019 Wed 09:59
  • స్థానికుల అప్రమత్తతతో మిగిలిన వాహనాలు సేఫ్‌
  • మల్కాజ్‌గిరి విష్ణుపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘటన
  • అఖండ దీపం నుంచి మంటలు విస్తరించి ప్రమాదం
గణేశ్ మండపంలో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు కార్లు, పది బైక్‌లు దగ్ధమయ్యాయి. స్థానికుల అప్రమత్తతతో పెద్ద  ప్రమాదం తప్పింది. ఆ వివరాల్లోకి వెళితే... మేడ్చల్‌ జిల్లా మల్కాజ్‌గిరి పరిధిలోని విష్ణుపురి కాలనీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామి వారి విగ్రహం ముందు అఖండ దీపం ఏర్పాటు చేశారు. ఈ దీపం కారణంగా మంటలు, ఇతర వస్తువులకు అంటుకుని అనంతరం విస్తరించాయని చెబుతున్నారు.

మంటలు భారీగా విస్తరించి సెల్లార్‌లోని వాహనాలను చుట్టుముట్టడంతో రెండు కార్లతోపాటు పది ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన నివాసితులు తమ వాహనాలను పక్కకు తీసేయడంతో మరిన్ని వాహనాలకు మంటలు విస్తరించకుండా ఆపగలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో అపార్ట్‌మెంట్‌ వాసులతోపాటు చుట్టుపక్కల నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు.