Software Engineer: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సతీశ్ ను హత్య చేసి రాత్రంతా రోడ్లపై తిరిగిన నిందితుడు హేమంత్!

  • హైదరాబాద్ శివారులో హేమంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అమ్మాయి విషయంలో మిత్రుల మధ్య గొడవలు
  • మద్యం మత్తులో ఘర్షణ!

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సతీశ్ హత్య సంచలనం సృష్టించింది. ఇంటి నుంచి వెళ్లిన సతీశ్ తన ఫ్రెండ్ హేమంత్ రూమ్ లో శవమై తేలాడు. దాంతో హేమంత్ పైనే అనుమానాలు బలపడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిందితుడు హేమంత్ ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారులో అతడిని పట్టుకున్నారు. సతీశ్ ను హత్య చేసిన తర్వాత రాత్రంతా రోడ్లపైనే తిరిగినట్టు తెలిసింది. ఆ మరుసటి రోజు స్నేహితుల వద్ద గడిపాడు.

హత్య విషయం తన సన్నిహితులకు వెల్లడించాడు. దాంతో భయపడిపోయిన అతడి మిత్రులు లొంగిపోవాలంటూ సలహా ఇచ్చారు. కానీ హేమంత్ మాత్రం తన బంధువుల ఇంట్లో దాక్కోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే పోలీసులు పక్కా సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని విషయాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. హత్య జరగడానికి కారణం ప్రియాంక అనే ఓ అమ్మాయి అని తెలుస్తోంది.

ప్రియాంక సాఫ్ట్ వేర్ ఇంజినర్ సతీశ్ కు సన్నిహితురాలు. తన రికమెండేషన్ తోనే ఆమెకు హేమంత్ కు చెందిన సంస్థలో ఉద్యోగం ఇప్పించాడు. అయితే, హేమంత్ ఆమెతో సన్నిహిత సంబంధం పెట్టుకోవడంతో స్నేహితులు ఇరువురి మధ్య విభేదాలు మొదలై హత్యకు దారితీసింది. హత్యకు ముందు సతీశ్, హేమంత్ ఇద్దరూ మద్యం తాగి ప్రియాంక విషయంలో గొడవ పెట్టుకున్నారు. ప్రియాంకతో సంబంధం కొనసాగించవద్దంటూ సతీశ్ వార్నింగ్ ఇవ్వగా, హేమంత్ దాన్ని సీరియస్ గా తీసుకుని మిత్రుడ్ని అంతమొందించాడు.

More Telugu News