Baadal: బెంగళూరులో 'వ్యోమగామి' వేషంలో ఆర్టిస్టు... రోడ్లపై ఉన్న గుంతల వద్ద సంచారం!

  • గతంలోనూ ఇదే తరహాలో రోడ్లపై 'మొసలి' కనిపించిన వైనం
  • మరోసారి స్పందించిన ఆర్టిస్టు బాదల్ నంజుండస్వామి
  • అధికారుల్లో చలనం తెచ్చేందుకు వినూత్న ప్రయోగం

కొన్నేళ్ల కిందట బెంగళూరు రోడ్లపై మొసలి, రాక్షసుల బొమ్మలు, మత్స్యకన్యతో బాదల్ నంజుండస్వామి అనే ఆర్టిస్టు అధికారుల్లో చలనం తెప్పించిన ఘటన తెలిసే ఉంటుంది. రోడ్లపై ఉన్న గుంతల్లో నీళ్లు నిలిచి ప్రమాదాలకు కారణం అవుతున్నాయంటూ ఓ రోడ్డుపై ఉన్న గుంతలో మొసలి బొమ్మను ఉంచి అందరినీ ఆలోచింపజేశాడు.

మరికొన్ని చోట్ల తెరిచి ఉంచిన మ్యాన్ హోల్స్ పై చైతన్యం కలిగించేలా రాక్షసులు నోరు తెరుచుకుని ఉన్నట్టుగా మ్యాన్ హోల్ చుట్టూ రాక్షసులను చిత్రించాడు. మరోచోట, రోడ్డుపై నీరు నిలిచిపోగా, అక్కడ ఓ మోడల్ సాయంతో మత్స్యకన్యను ఆవిష్కరించాడు. ఇప్పుడదే తరహాలో మరోసారి స్పందించాడు.

వ్యోమగామి అవతారంలో రోడ్లపై ఉన్న ప్రమాదకరమైన గుంతల వద్ద సంచరించాడు. ఇతర గ్రహంలో వ్యోమగామి ఎలా నడుస్తాడో అదే రీతిలో నంజుండస్వామి కూడా నడిచాడు. దీని తాలూకు వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సృజనాత్మక పద్ధతిలో నంజుండస్వామి చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

More Telugu News