Altaf Hussain: పాకిస్థాన్ నేత సంచలనం.. ‘సారే జహాసే అచ్చా హిందూస్థాన్ హమారా’ అంటూ పాటందుకున్న అల్తాఫ్ హుస్సేన్

  • 370 రద్దుకు మద్దతు ప్రకటించిన పాక్ నేత
  • మద్దతుదారుల సమక్షంలో పాట పాడి అలరించిన అల్తాఫ్
  • భారత్ చేతిలో నాలుగుసార్లు ఓడినా బుద్ధి రాలేదని వ్యాఖ్య
జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుతోపాటు రాష్ట్రాన్నికేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పాక్ ఉడికిపోతూ అక్కసు ప్రదర్శిస్తుంటే ఆ దేశానికే చెందిన ఓ నేత ‘సారే జహాసే అచ్చా హిందూస్థాన్ హమారా’ అంటూ పాడి సంచలనం సృష్టించారు. ఆయన పాడిన పాటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారత్‌తో యుద్ధం వచ్చే అవకాశం ఉందని పాక్ ప్రధాని ఇమ్రాన్ హెచ్చరిస్తుంటే ఆ దేశ నేత అల్తాఫ్ హుస్సేన్ ఆర్టికల్ 370 రద్దుపై భారత్‌ను సమర్థించారు. కశ్మీర్ అంశం భారత అంతర్గత విషయమని తేల్చి చెప్పారు. అంతేకాక సారే జహాసే అచ్చా.. అంటూ పాటపాడి సంచలనం సృష్టించారు.

ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ (ఎంక్యూఎం) వ్యవస్థాపకుడైన హుస్సేన్ తమ మద్దతుదారులతో మాట్లాడుతూ భారత్‌ను పొగుడుతూ పాట పాడారు. ప్రస్తుతం లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న హుస్సైన్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దును సమర్థించారు. దేశ ప్రజల మద్దతుతో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. గడిచిన 72 ఏళ్లుగా పాక్ ప్రభుత్వాలు కశ్మీర్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.

జమ్మూకశ్మీర్‌ను దక్కించుకునేందుకు అప్పట్లో పాక్ గిరిజనులను ఉపయోగించుకుందని, దీంతో కశ్మీర్ రాజు భారత ప్రభుత్వం సాయం కోరారని గుర్తు చేశారు. కశ్మీర్‌ను భారత్‌లో కలపడంతో రగిలిపోయిన పాక్.. భారత్‌తో నాలుగుసార్లు యుద్ధం చేసిందని, అన్నింట్లోనూ పరాజయం పాలైందని పేర్కొన్నారు. అయినప్పటికీ బుద్ధి మార్చుకోని పాక్.. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తోందని ఆరోపించారు.

దేశంలోని అమాయక ప్రజలపై పాక్ దారుణాలకు పాల్పడుతోందన్న హుస్సేన్.. మొహాజిర్లు, బలోచ్ వాసులు, పస్తూన్లు, సింధులు, హజర్వాల్స్, గిల్గిత్‌ ప్రజలతోపాటు ఇతర మైనారిటీ ప్రజలను హతమారుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యమే లేదని ఆరోపించారు. భారత్-పాక్‌లు ఒకేసారి స్వాత్యంత్ర్యం పొందినా భారత్ దూసుకుపోతుంటే పాక్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉందని హుస్సేన్ పేర్కొన్నారు.
Altaf Hussain
Pakistan
Sare Jahan se Accha
article 370
Jammu And Kashmir

More Telugu News