Bihar: మద్యనిషేధం తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకున్న బీహార్ ప్రభుత్వం

  • పాన్ మసాలాపై బ్యాన్ విధించిన బీహార్ సర్కార్
  • పాన్ మసాలాలో హాని కలిగించే మెగ్నీషియం కార్బొనేట్
  • ప్రజల మంచి కోసమే నిషేధించామన్న ప్రభుత్వం

బీహార్ లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం ఇప్పటికే మద్యపానంపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మద్యనిషేధం విధించి, మందుబాబులకు షాక్ ఇచ్చింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ మసాలా అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. పాన్ మసాలా అమ్మకాలు, నిలువ, రవాణా అన్నింటిపై నిషేధం అమల్లోకి వచ్చింది.

ఈ సందర్భంగా బీహార్ చీఫ్ సెక్రటరీ దీపక్ కుమార్ మాట్లాడుతూ, నిషేధాజ్ఞలను ఎవరు ఉల్లంఘించినా కఠినంగా శిక్షిస్తామని, జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. పాన్ మసాలా అమ్మకాలు, నిలువ, రవాణా, వినియోగాలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుందని, దీనికి సంబంధించి ఒక పక్కా ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు.

ఆరోగ్యానికి హాని కలిగించే మెగ్నీషియం కార్బొనేట్ పాన్ మసాలాల్లో ఉన్నట్టు ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ఈ రసాయనం గుండె సంబంధిత రుగ్మతలకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలోనే, పాన్ మసాలాపై బీహార్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. ప్రజల మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని దీపక్ కుమార్ తెలిపారు. అయితే, పొగాకును పండించే రైతులపై ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పారు.

More Telugu News