weather: బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

  • తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు
  • ఇప్పటికే ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలు
  • వినాయక ఉత్సవ నిర్వాహకులకు నిరాశే

బంగాళాఖాతంలో కోస్తా తమిళనాడు పరిసరాల్లో సముద్రమట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి సెప్టెంబర్‌ 2 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

 ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దానికి అనుబంధంగా వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నిన్న చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ఇది బలహీనపడగా, తమిళనాడు కోస్తాలో ఏర్పడిన ద్రోణి బలపడుతోంది. ఈ కారణంగా తెలంగాణ, కోస్తాంధ్ర, దీన్ని ఆనుకుని ఉన్న ఒడిశా, చత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సోమవారం వినాయక ఉత్సవాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో వర్షం కురిస్తే నిర్వాహకులకు కొంత నిరాశే అని చెప్పొచ్చు. కాగా, శుక్రవారం రోజంతా ఎండతీవ్రంగా ఉండగా, పగటి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. సాయంత్రానికి అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. 

  • Loading...

More Telugu News