Ranu Mondal: సంచలన గాయని రాణు మోండాల్ కు సల్మాన్ ఖాన్ ఇంటిని కానుకగా ఇవ్వలేదు: రానాఘాట్ క్లబ్

  • రైళ్లలో పాటలు పాడే రాణు మోండాల్ కు బాలీవుడ్ చాన్స్
  • సల్మాన్ రూ.55 లక్షల విలువైన ఇంటిని కానుకగా ఇచ్చాడంటూ కథనాలు
  • వాటిల్లో నిజం లేదంటున్న అమ్రా శోభాయ్ షోయితన్ క్లబ్ సభ్యులు

రైళ్లలో పాటలు పాడుకునే ఓ సామాన్యురాలికి బాలీవుడ్ లో పాడే అవకాశం రావడం ఓ అద్భుతం. పశ్చిమ బెంగాల్ లోని రాణాఘాట్ ప్రాంతానికి చెందిన రాణు మోండాల్ రైల్వే ప్లాట్ ఫామ్ పై పాడిన పాట యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేసింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేశ్ రేషమ్మియా కూడా రాణు మోండాల్ పాటకు ఫిదా అవడమే కాకుండా ఆమెతో తన కొత్త చిత్రంలో పాడించాడు. అయితే, రాణు పాటను విన్న సల్మాన్ ఖాన్ ఆమెకు రూ.55 లక్షల ఖరీదైన ఇంటిని కానుకగా ఇచ్చాడంటూ కథనాలు వచ్చాయి. వాటిలో నిజంలేదని రాణాఘాట్ కు చెందిన అమ్రా శోభాయ్ షోయితన్ క్లబ్ సభ్యులు అంటున్నారు.

రాణు మోండాల్ ప్లాట్ ఫామ్ పై పాడుతుండగా వీడియో తీసి వాట్సాప్, ఫేస్ బుక్ లో ప్రచారం చేసింది ఈ క్లబ్ సభ్యులే.  సల్మాన్ ఖాన్ ఆమెకు ఇల్లును కానుకగా ఇచ్చినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని, ఇది సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఫేక్ న్యూస్ మాత్రమేనని క్లబ్ సభ్యుడైన వికీ బిశ్వాస్ తెలిపారు.

ఇదే కాకుండా రాణు గురించి అనేక అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని, ఆమె రూ.15 లక్షల ఖరీదు చేసే ఇంటిని కొనుగోలు చేసిందని, బిగ్ బాస్ షో నుంచి పిలుపు వచ్చిందని, ఓ సాంగ్ రికార్డు చేసినందుకు హిమేశ్ రేషమ్మియా ఆమెకు రూ.50 లక్షలు ఇచ్చినట్టు అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయని బిశ్వాస్ వెల్లడించారు. హిమేశ్ ఆమెకు ఎంతో సాయం చేసిన మాట నిజమే అయినా, ప్రచారంలో ఉన్న కథనాలు మాత్రం కల్పితాలని పేర్కొన్నారు.

More Telugu News