TTD: పెరగనున్న టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్య

  • 19 నుంచి 25కి పెంచాలని ప్రభుత్వ నిర్ణయం
  • ఇప్పటికే జాబితా గవర్నర్‌ కు పంపిన ప్రభుత్వం 
  • ఈసారి తెలంగాణకు చెందిన ముగ్గురికి అవకాశం

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 19 మంది సభ్యుల స్థానంలో మొత్తం 25 మందికి చోటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గవర్నర్‌ ఆమోదానికి పంపింది. ఆయన సంతకం కాగానే సభ్యుల నియామకం ప్రక్రియ ప్రారంభమవుతుంది.

మరోపక్క, ఇప్పటికే పాలక మండలి సభ్యుల జాబితా ఖరారయిందని, గవర్నర్‌ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. ఈసారి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురికి పాలక మండలిలో చోటు కల్పించనున్నట్లు సమాచారం. వీరిలో పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వరరావు పేరు ఖరారైనట్టు సమాచారం. అలాగే తమిళనాడు నుంచి ఇండియా సిమెంట్స్‌ ఎండీ ఎన్‌.శ్రీనివాసన్‌, కృష్ణమూర్తిలకు చోటు దక్కే ఛాన్స్ ఉంది.  

ఇక ఏపీకి సంబంధించి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి భార్య ప్రశాంతిరెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, యలమంచిలి ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు పేర్లు వినిపిస్తున్నాయి. తుడా చైర్మన్‌ హోదాలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎలాగూ మండలిలో ఉంటారు.

More Telugu News