bocha satyanarayana: చంద్రబాబుపై మాకు కక్ష లేదు.. బాబు లక్ష్యం దుష్ప్రచారమే: మంత్రి బొత్స

  • వరదల సమయంలో ఎవరికీ ఇబ్బంది కలగలేదు
  • సుజనా చౌదరి టీడీపీ నేతలా మాట్లాడుతున్నారు
  • రైతులకు ఇబ్బంది కలిగితే చూస్తూ ఊరుకోబోం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై తమకు ఎలాంటి కక్ష లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో కొద్దిసేపటి క్రితం విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఇటీవల వచ్చిన వరదలకు తన ఇల్లు మునుగుతుందనే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ హైదరాబాద్ పారిపోయారని విమర్శించారు. వరద సమయంలో ప్రాజెక్టులపై సమీక్షలు జరిపినట్టు తెలిపారు. విజయవాడ కంటే అమరావతి భౌగోళికంగా లోతట్టు ప్రాంతంలో ఉందన్నారు. వరదల సమయంలో ఆయా ప్రాంతాల్లో ఎవరికీ ఇబ్బంది కలగలేదని బొత్స పేర్కొన్నారు. రాజధాని విషయంలో రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని భరోసా  ఇచ్చారు.

ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కంకణం కట్టుకున్నారని అన్నారు. 2009లో వచ్చినట్టు 10.90 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని, అలాంటి పరిస్థితి మళ్లీ వస్తే పరిస్థితి ఏంటనే అన్నానని గుర్తు చేశారు. రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిపై బొత్స తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతలు ఏం మాట్లాడుతుంటే బీజేపీ నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారని అన్నారు. ఓ జాతీయ పార్టీ నేత అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని, బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. ఫ్లడ్ మేనేజ్‌మెంట్ మాకు చేతకాదని చంద్రబాబు అంటున్న దాంట్లో నిజం లేదన్నారు. రైతులకు చిన్నపాటి కష్టం వచ్చినా వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

More Telugu News