bihar: ప్రాణాపాయ స్థిలో వున్న పాముకు శస్త్ర చికిత్స... దెబ్బతిన్న తోకను సరిచేసిన వైద్యులు

  • రెండు రోజులపాటు  పర్యవేక్షణ
  • కోలుకున్న అనంతరం అడవిలో వదిలిన వైనం
  • బీహార్‌ రాష్ట్రం పాట్నాలో ఘటన

మనిషికి అరుదైన శస్త్ర చికిత్స జరిగిందని అనడం వింటాం. మరి పాముకే అటువంటి అరుదైన ఆపరేషన్‌ జరిగిందని తెలిస్తే కాస్త ఆశ్చర్య పోవడం సహజమే కదా. అయితే ఈ కథనం చదవండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మూగ జీవాలను మానవత్వంతో ఆదుకోవడం మనిషి విధి. బీహార్‌ రాష్ట్రం పాట్నాలోని పశు వైద్య కళాశాల ఆసుపత్రి వైద్యులు అదే చేశారు.

తోక భాగంలో తీవ్రంగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పాముకు శస్త్రచికిత్స చేసి అది కోలుకున్నాక అడవిలో విడిచిపెట్టారు. ఈ పామును బతికించేందుకు దాదాపు రెండు గంటలపాటు వైద్యులు శ్రమించారు. తోక భాగం దెబ్బతిని కదల్లేని స్థితిలో ఉన్న పామును ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యుడు వెటర్నరీ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఎక్స్‌రే తీసిన వైద్యులు పాము తోకభాగంలో కొంత తీవ్రంగా దెబ్బతిన్నదని గుర్తించారు.

వెంటనే దానికి మత్తు మందు ఇచ్చి దెబ్బతిన్న భాగం వరకు తోకను వేరు చేశారు. అనంతరం దెబ్బతిన్న భాగాన్ని తీసేసి మిగిలిన తోక భాగాన్ని తిరిగి అతికించారు. ఆపరేషన్‌ అనంతరం రెండు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి పాము కోలుకున్నదని నమ్మకం కుదిరాక సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలేశారు.

More Telugu News