Nara Lokesh: మంత్రి సాక్షిగా నిండు ప్రాణం బలి... ప్రాణాలంటే ఇంత చులకనా?: నారా లోకేశ్ ఫైర్

  • ప్రకాశం బ్యారేజ్ లో పడి వ్యక్తి మృతి
  • తీవ్రంగా స్పందించిన లోకేశ్
  • గేట్లు ఎత్తేముందు కనీస హెచ్చరికలు చేయాలని తెలియదా? అంటూ మండిపాటు
ప్రకాశం బ్యారేజికి అడ్డంగా ఉన్న చిన్న బోటును కూడా తొలగించలేని చేతకాని ప్రభుత్వం అంటూ నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ ఈ స్థాయిలో స్పందించడానికి కారణం ప్రకాశం బ్యారేజ్ లో పడి ఓ వ్యక్తి ప్రాణం కోల్పోవడమే. మంత్రి సాక్షిగా ఓ అమాయకుడి ప్రాణాలు పోయాయని, ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి ఇంత చులకనా? అంటూ లోకేశ్ ట్విట్టర్ లో మండిపడ్డారు.

ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి నీటి ఉద్ధృతికి నదిలో పడిపోయాడు. కొంతసేపు ఈదినా అప్పటికే నీళ్లు తాగేయడంతో మరణించాడు. దీనిపై లోకేశ్ మండిపడ్డారు. బ్యారేజ్ గేట్లు తెరిచే ముందు కనీస హెచ్చరికలు చేయాలని తెలియదా? అంటూ నిలదీశారు. మరీ ఇంత అహంకారమా? అంటూ నిప్పులు చెరిగిన లోకేశ్, మంత్రి సమక్షంలో ఈ విధంగా జరగడం దారుణమని వ్యాఖ్యానించారు.

ప్రజల రక్షణలో ప్రభుత్వం నూటికి నూరు శాతం ఫెయిలైందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అని, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Nara Lokesh
Prakasham Barrage
Telugudesam
YSRCP

More Telugu News