Shekawat: ‘పోలవరం’పై వాస్తవ నివేదిక వచ్చాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం: కేంద్ర మంత్రి షెకావత్

  • రెండు రోజుల్లో ఈ నివేదిక వస్తుంది
  • ‘పోలవరం’ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో ఉంది
  • దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను

పోలవరం ప్రాజెక్టుకు డబ్బు చెల్లించేది కేంద్ర ప్రభుత్వమని, ఈ ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు కేంద్రానికి ఉంటుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పోలవరం’ నిర్మాణానికి సంబంధించి వాస్తవ నివేదికను తమకు పంపాలని ప్రాజెక్టు అథారిటీని ఆదేశించానని, రెండు రోజుల్లో ఆ నివేదిక వస్తుందని చెప్పారు. నివేదిక వచ్చాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందని, ఈ స్టేను అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని అన్నారు. మోదీ, అమిత్ షా ఆశీస్సులతోనే రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలను సీఎం జగన్  తీసుకుంటున్నారన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై షెకావత్ పరోక్ష విమర్శలు చేశారు. కేంద్రం పని కేంద్రం చేస్తుందని, రాష్ట్రం పని రాష్ట్రం చేయాలని సూచించారు.

More Telugu News