చాక్లెట్లు ఇస్తానని పిలిచి ఆరేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం.. అరెస్ట్!

22-08-2019 Thu 12:43
  • ఆరేళ్ల చిన్నారిపై 62 ఏళ్ల వృద్ధుడి లైంగిక దాడి
  • డబ్బులతో సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం
  • అరెస్ట్ చేసిన పోలీసులు.. కస్టడీకి తరలింపు
62 ఏళ్ల వృద్ధుడు.. ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాతయ్యలాంటోడని నమ్మితే.. ఏ పాపం తెలియని చిట్టితల్లిపై మృగంలా రెచ్చిపోయాడు. ఇదేంటని నిలదీస్తే, డబ్బులిస్తా... గొడవ చేయొద్దు అంటూ తన పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘోరం శ్రీకాకుళం జిల్లా, మందస మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...

ఈ నెల 18న గొరకల రుషి అనే వృద్ధుడు తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని దగ్గరికి పిలిచాడు. చాక్లెట్లు ఇస్తానని చెప్పడంతో ఆ చిన్నారి ఆశపడింది. తాతయ్య అంటూ తన దగ్గరకు వచ్చిన ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. తరువాతి రోజు పాప అనారోగ్యానికి గురైంది. ఆ అమ్మాయిని హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా డాక్టర్లు అసలు విషయం తెలిపారు.

ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తల్లిదండ్రులు తీసుకు వెళ్లగా, సదరు కామాంధుడు తన తప్పును అంగీకరించాడు. పరిహారంగా డబ్బులు ఇస్తానని, సెటిల్ మెంట్ చేసుకుందామని కాళ్లబేరానికి వచ్చాడు. దానికి ససేమీరా అన్న తల్లిదండ్రులు సోంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.