Andhra Pradesh: ‘పచ్చ’ రక్తం చేరాక బీజేపీ యాక్టివ్ అయింది.. దెబ్బతింటారు జాగ్రత్త!: అంబటి రాంబాబు

  • మామీద హిందూ వ్యతిరేక ముద్ర వేస్తున్నారు
  • దీనివల్ల అంతిమంగా బీజేపీయే నష్టపోతుంది
  • వరదముప్పుతోనే చంద్రబాబు పారిపోయారు
కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని ఏపీ సీఎం జగన్ చెప్పారని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. అలాంటిది తమను హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తే బీజేపీయే అంతిమంగా నష్టపోతుందని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ.. ‘ఒక ముఖ్యమంత్రిని కామెంట్ చేసేముందు తెలుసుకుని మాట్లాడాలి.

సక్రమంగా ఆలోచించి కామెంట్ చేయాలి. ఈ మధ్య బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య ‘పచ్చ’ రక్తం ప్రవేశించిన తర్వాత యాక్టివ్ అయినట్లు ఉన్నారు. ఈ పచ్చ రక్తంతో మీ ఒరిజినాలిటీ పోగొట్టుకుంటే దెబ్బతింటారు.. జాగ్రత్త. వాస్తవాలను పరిశీలించి మాట్లాడాల్సిన బాధ్యత ఓ జాతీయ పార్టీకి ఉంది. అంతేతప్ప బురద చల్లుడు కార్యక్రమాలు చేపట్టవద్దు’ అని బీజేపీకి హితవు పలికారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా అంబటి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయడం లేదని అంబటి దుయ్యబట్టారు. చేయి నొప్పి వస్తే చంద్రబాబు హైదరాబాద్ కు వెళ్లడం ఏంటని అంబటి ప్రశ్నించారు. వరద ముప్పు ఉంది కాబట్టే చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయారని స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనీ, అంతేతప్ప ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేయవద్దని చంద్రబాబుకు అంబటి హితవు పలికారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
AMBATI RAMBABU
BJP

More Telugu News