Chidambaram: అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి చిదంబరం..?

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి బెయిల్ నిరాకరణ
  • చిదంబరం నివాసానికి వెళ్లిన సీబీఐ, ఈడీ అధికారులు
  • ఫోన్ స్విచాఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయిన చిదంబరం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం చిక్కుల్లో పడ్డారు. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో ఆయనకు ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం ఆయన నివాసానికి వెళ్లిన సీబీఐ, ఈడీ అధికారులకు నిరాశే ఎదురైంది. చిదంబరం తన నివాసంలో లేకపోగా, ఆయన ఫోన్ కూడా స్విచాఫ్ అయింది.

అరెస్టు నుంచి తప్పించుకునేందుకే చిదంబరం అదృశ్యమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 2007లో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా గ్రూప్ కు రూ.305 కోట్లు విదేశీ నిధుల రూపంలో వచ్చాయి.

దీనికి అనుమతులు ఇచ్చింది చిదంబరం పేషీనే కావడంతో ఆయనపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తదనంతర కాలంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ కూడా ఇరుక్కున్నాడు. ఇప్పుడీ కేసులకు సంబంధించిన వ్యవహారంలోనే చిదంబరం బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా, ఢిల్లీ హైకోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఆయన జాడ తెలియడంలేదు.
Chidambaram
ED
CBI
INX

More Telugu News