Jammu And Kashmir: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ కు కానీ, చైనాకు కానీ మేము సపోర్ట్ చేయలేదు: యూటర్న్ తీసుకున్న బ్రిటన్

  • సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చైనా కోరింది
  • ఇందులో మా పాత్ర లేదు
  • ఈ వార్తలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు
జమ్మూ కశ్మీర్ అంశంపై గత శుక్రవారం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి రహస్య సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. చైనా కోరిక మేరకు ఈ సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశంలో పాకిస్థాన్ కు అనుకూలంగా బ్రిటన్ వ్యవహరించిందనే వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా బ్రిటన్ ఈ అంశంపై స్పందించింది. భద్రతామండలి సమావేశంలో పాకిస్థాన్ కు కానీ, చైనాకు గాని మద్దతుగా తాము వ్యవహరించలేదని బ్రిటన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

యూకే సీనియర్ దౌత్యవేత్త ఒకరు మాట్లాడుతూ, 'భద్రతామండలి రహస్య సమావేశంలో పాక్, చైనాకు మద్దతుగా... భారత్ కు వ్యతిరేకంగా మేము వ్యవహరించలేదు. కశ్మీర్ అంశాన్ని ఇండియా-పాకిస్థాన్ లే పరిష్కరించుకోవాలనేది మేము ఎప్పుడో తీసుకున్న నిర్ణయం. సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చైనా కోరింది. ఇందులో మా పాత్ర ఏమీ లేదు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని భారత్ ఏకపక్షంగా నిర్ణయాన్ని తీసుకుందనే విషయాన్ని చైనా చెప్పాలనుకుంది' అని తెలిపారు. సమావేశం తర్వాత ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని చెప్పారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని... కేవలం చర్చ మాత్రమే జరిగిందని అన్నారు. భారత్ కు వ్యతిరేకంగా తాము వ్యవహరించామనే వార్తలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని తెలిపారు. ఐదు, ఆరు దశాబ్దాల కాలంలో కశ్మీర్ పై భద్రతామండలి చర్చించడం ఇదే తొలిసారని చెప్పారు.
Jammu And Kashmir
Article 370
UK
UNO Security Counsil
China
India
Pakistan

More Telugu News