Shehla Rashid: కశ్మీర్ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేసిన జేఎన్యూ విద్యార్థి నేత షెహ్లా రషీద్

  • జవాన్లు ఇళ్లలోకి చొరబడుతున్నారు
  • యువకుల్ని తీసుకెళ్లి హింసిస్తున్నారు
  • స్థానిక పోలీసులు అధికారాలు కోల్పోయారు

కశ్మీర్ లో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి నేత  షెహ్లా రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యావసర వస్తువులు కూడా అందక ఇబ్బంది పడుతున్నారని ట్వీట్ చేశారు. స్థానిక పోలీసులు అధికారాలు కోల్పోయారని... మిలిటరీ బలగాలు హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇళ్లలోకి చొరబడుతున్న జవాన్లు.... యువకుల్ని అకారణంగా తీసుకెళ్తున్నారని విమర్శించారు.

కశ్మీర్ లో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని షీలా అన్నారు. మీడియాను కూడా అనుమతించడం లేదని చెప్పారు. గ్యాస్ స్టేషన్లను మూసి వేశారని... మందుల కోసం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. డీటీహెచ్ రీచార్జ్ చేసుకునే అవకాశం కూడా లేదని... అతి కొద్ది మందికి మాత్రమే టీవీ ప్రసారాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

కశ్మీర్ పోలీసులకు శాంతిభద్రతలపై అధికారాలు లేవని... ఒక సీఆర్ఫీఎఫ్ అధికారి ఫిర్యాదు మేరకు ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను బదిలీ చేశారని అన్నారు. పారామిలిటరీ బలగాలు ఇళ్లలోకి చొరబడి దోపిడీకి పాల్పడుతున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

షోపియాన్ లో నలుగురు యువకుల్ని ఆర్మీ క్యాంప్ కు పిలిపించి, చిత్రహింసలు పెట్టారని... వారి వద్ద మైక్ పెట్టి, వారి అరుపుల్ని ఆ ప్రాంతంలోని వారికి వినిపిస్తూ భయభ్రాంతులకు గురి చేశారని షెహ్లా చెప్పారు. చాలా భయంకరమైన వాతావరణం కశ్మీర్ లో ఉందని అన్నారు.

More Telugu News