Facebook: సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతులను దోచుకున్న వంచకుడు.. అరెస్ట్!

  • నటుల పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు
  • అందినంత దోచుకుంటున్న వైనం
  • అసలు నటుడి ఫిర్యాదుతో కేసు నమోదు  

వెండి తెరపై ఓ వెలుగు వెలగాలన్న ఆశతో తనకు తారసపడే అందమైన అమ్మాయిలను మోసం చేయడమే ఈ నయవంచకుడి నిత్యకృత్యం. ఓ ప్రముఖ కన్నడ హీరో పేరిట ఫేస్ బుక్ ఖాతా, మరో నిర్మాత పేరిట వాట్స్ యాప్ ఫోన్ నంబర్ తో పరిచయమై, వారిని అడ్డంగా మోసం చేసే ఇతన్ని, బెంగళూరు పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు.

సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, సుంకదకట్టె, హొయ్సళ నగరకు చెందిన వెంకటేశ్‌ భావసా (22) అనే యువకుడు, సినీ నటుల పేరిట నకిలీ ఫేస్‌ బుక్‌ అకౌంట్లు తెరిచి యువతులను పరిచయం చేసుకునేవాడు. తనకు ఎవరైనా అమ్మాయి తగిలితే, సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తానని, వెంకీరావ్‌ అనే వ్యక్తి తన అసిస్టెంట్ అనీ చెబుతూ నంబర్ ఇచ్చేవాడు. ఆపై తనే వెంకీరావ్‌ గా మారి వాట్సాప్‌ ద్వారా చాటింగ్ చేసి, అందినంత డబ్బు గుంజుకునేవాడు.

 ఓ యువతి అలాగే మోసపోయి, వీడియో కాల్ చేసేందుకు ప్రయత్నించగా కాల్‌ కట్‌ చేసి తప్పించుకున్నాడు. దీంతో ఆమె, ఆ పేరుతో వున్న అసలు సినీ నటుడిని సంప్రదించింది. తన పేరుతో ఫేస్‌ బుక్‌ ఖాతా తెరిచి మోసాలకు పాల్పడుతున్నాడని గమనించిన అతను, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిన్న వెంకటేశ్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

More Telugu News