Zomato: ఒక్క ఎగ్ దోశతో అర్థరాత్రి ఇంటికెళ్లే ప్లాన్... హైదరాబాద్ యువకుడి ఆలోచన సూపరో సూపర్!

  • ఆటో దొరకక ఫుడ్ ఆర్డర్ చేసిన ఓబేశ్
  • డెలివరీ బాయ్ వాహనంపై ఇంటికి
  • అతని ఆలోచనను మెచ్చుకుంటున్న నెటిజన్లు

ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో, లేదో తెలియదుగానీ, ఈ హైదరాబాద్ యువకుడికి వచ్చిన ఆలోచన అతన్ని రాత్రి పూట పైసా ఖర్చు లేకుండా ఇంటికి చేర్చింది. అతను వేసిన ప్లాన్ ను చూసి నెటిజన్లు "హో డూడ్... నువ్వు సూపరో సూపర్" అని కితాబిస్తున్నారు. అలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలంటే, ఆసలేం జరిగిందో తెలుసుకోవాల్సిందే.

అతని పేరు కొరిమిశెట్టి ఓబేశ్. రాత్రి 11.50 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు ఇనార్బిట్ మాల్ రోడ్డుపై వెయిట్ చేస్తున్నాడు. ఎంతసేపటికీ ఆటోలు రాలేదు. ఉబెర్ యాప్ ను తెరచి చూస్తే చార్జీ రూ. 300 వరకూ అవుతుందని చూపించింది. అదే సమయంలో అతనికి ఆకలి వేస్తుండటంతో, జొమాటో ఓపెన్ చేసి, దగ్గరలో ఏదైనా ఫుడ్ స్టోర్ ఉందేమోనని చూడగా, ఓ దోశబండి కనిపించింది. వెంటనే ఓ ఎగ్ దోశను హోమ్ కు తెచ్చివ్వాలంటూ ఆర్డర్ వేశాడు.

ఆ తరువాత అదే బండి దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. ఇంతలో ఆర్డర్ తీసుకునేందుకు ఓ డెలివరీ బాయ్ అక్కడకు రాగా, ఈ ఆర్డర్ తనదేనని, తనను ఇంటివద్ద దింపాలని కోరాడు. దీనికి అంగీకరించిన డెలివరీ బాయ్, ఓబేశ్ ను ఇంట్లో దింపి, "నాకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి సార్" రిక్వెస్ట్ చేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓబేశ్, తనకు ఉచిత ప్రయాణాన్ని అందించిన జొమాటోకు కృతజ్ఞతలని చెప్పాడు.

ఈ పోస్ట్ వైరల్ అయింది. గంటల వ్యవధిలో వేల షేర్లు తెచ్చుకుంది. దీన్ని చూసిన జొమాటో సైతం స్పందించింది.  "సరికొత్త సమస్యలకు సరికొత్త పరిష్కారాలు" అని ట్వీట్ చేసింది. ఓబేశ్ ఐడియాను మెచ్చుకుంటూ ఇప్పుడు తెగ కామెంట్లు వస్తున్నాయి.

More Telugu News