Undavalli: డ్రోన్ చక్కర్లు.. కార్యకర్తలపై లాఠీఛార్జ్ ఘటనలపై గవర్నర్, డీజీపీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ!

  • చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల భేటీ
  • ఆయా ఘటనలపై చర్చ
  • బాబు భద్రతపై టీడీపీ నేతల ఆందోళన

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వరద పరిస్థితిని తెలుసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అనుమతితోనే ఈ డ్రోన్ ను ప్రయోగించడం జరిగిందని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అయితే, ఎన్ఎస్జీ భద్రత కలిగిన ఓ మాజీ సీఎం నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడమేంటని, చంద్రబాబు భద్రతపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. టీడీఎల్పీ ఉపనేత డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే మద్దాల గిరి, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు, జనార్దన్, వర్ల రామయ్య, మాజీ మంత్రులు ఆలపాటి రాజా, దేవినేని ఉమ తదితరులు హాజరయ్యారు.

చంద్రబాబు నివాసం వద్దకు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్లడం, ఆ తర్వాత, టీడీపీ నాయకులపై లాఠీఛార్జి జరగడం వంటి విషయాలను ఖండించారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడి ఇంట్లోకి అనుమతి లేకుండా చొరబడడం జాతీయస్థాయిలో తీవ్రమైన అంశంగా పరిగణిస్తారని, డ్రోన్ కార్పొరేషన్ సమన్వయంతో డ్రోన్ నడిపారా? ఏవియేషన్ శాఖ అనుమతులు తీసుకున్నారా? అనే అంశాలపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం.

జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు నివాసంలోకి అనుమతి లేకుండా వెళ్లిన ఆళ్ల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయమై జాతీయస్థాయి నేర పరిశోధనా సంస్థల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఏపీ డీజీపీకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలిసి వెళ్లి ఫిర్యాదు చేయాలని, టీడీఎల్పీ ఉపనేతలు, ఎంపీలు, స్థానిక ఎమ్మెల్యేలు సోమవారం నాడు ఏపీ గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. 

More Telugu News