Hyderabad District: కొత్త నగరాలు వస్తున్నాయి...భాగ్యనగరం చుట్టూ 13 సిటీల అభివృద్ధి!

  • హైదరాబాద్‌ శివారు ప్రాంతాలపై హెచ్‌ఎండీఏ దృష్టి
  • 50 వేల ఎకరాలు సద్వినియోగంలోకి తేవాలని నిర్ణయం
  • దీనివల్ల నగరంపై ఒత్తిడి తగ్గుతుందన్న భావన

హైదరాబాద్‌ మహానగరాన్ని ఆనుకుని సరికొత్త నగరాల సృష్టికి హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అడుగులు వేస్తున్నట్లు సమాచారం. భాగ్య నగరానికి దీటుగా మరో 13 కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండీఏ తాజా నిర్ణయంగా తెలుస్తోంది. ఇందుకోసం భాగ్యనగరాన్ని ఆనుకుని ఉన్న 50 వేల ఎకరాల భూమిని సద్వినియోగంలోకి తేవాలని అథారిటీ ఆలోచన.

 హైదరాబాద్‌లో ప్రస్తుతం కోటికి పైగా జనాభా ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ నిత్యం వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వారితో నగరం కిటకిటలాడుతోంది. నగర జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది.

మరోవైపు హైదరాబాద్‌ నగరం చుట్టూ వున్న ఔటర్‌ రింగు రోడ్డును ఆనుకుని దాదాపు 50 వేల ఎకరాల భూమి నిరుపయోగంగా పడివుంది. కనీసం సర్వీసు రోడ్లు కూడా లేకపోవడంతో ఈ భూమి వృథాగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో ఔటర్‌కు ఆవల చుట్టూ మరో 13 కొత్త నగరాలను అభివృద్ది చేయాలన్నది హెచ్‌ఎండీఏ యోచన. ఇందుకోసం హెచ్‌ఎండీఏ కొన్నాళ్ల క్రితమే దీనిపై ఓ సమగ్ర నివేదిక తయారుచేసి ప్రభుత్వం ముందు ఉంచినట్లు సమాచారం.

అయితే ఇన్నాళ్లు ఈ నివేదిక గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా ఈ నివేదిక బూజు దులిపి ప్రభుత్వం ముందుంచాలని మరోసారి హెచ్‌ఎండీఏ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి, కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఎంతవరకు అంగీకరిస్తుందన్నది ఆసక్తి రేకెత్తించే అంశం.

More Telugu News