Zakir Naik: మలేసియాలోని హిందువులపై అభ్యంతరకర వ్యాఖ్యలు: జకీర్ నాయక్ ను విచారించనున్న మలేసియా ప్రభుత్వం

  • గత మూడేళ్ల నుంచి మలేసియాలో తలదాచుకుంటున్న జకీర్ నాయక్
  • మలేసియాలో ఉన్న హిందువులు భారత్ లోని ముస్లింలకన్నా 100 రెట్లు ఎక్కువ హక్కులను అనుభవిస్తున్నారంటూ వ్యాఖ్య
  • జకీర్ ను దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసిన పలువురు మంత్రులు

ముస్లిం యువతను ఉగ్రవాదం పట్ల ఆకర్షితులయ్యేలా ప్రసంగాలు చేసిన ముస్లిం మత ప్రబోధకుడు జాకీర్ నాయక్ మలేసియాలో తలదాచుకున్న సంగతి తెలిసిందే. అతన్ని భారత్ కు రప్పించేందుకు మన ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ... మలేసియా ప్రభుత్వం అతన్ని భారత్ కు అప్పగించడం లేదు. ఈ క్రమంలో, మలేసియాలో ఉన్న హిందువులపై జకీర్ నాయక్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీంతో, అతనికి మలేసియా అధికారులు సమన్లు పంపించారు. తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

మలేసియాలోని హిందువులు భారత్ లోని ముస్లింల కన్నా 100 రెట్లు ఎక్కువ హక్కులను అనుభవిస్తున్నారంటూ జకీర్ నాయక్ నిన్న వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే జకీర్ నాయక్ ను దేశం నుంచి బహిష్కరించాలంటూ పలువురు మలేసియా మంత్రులు డిమాండ్ చేశారు. దీంతో, అక్కడి అధికారులు జకీర్ నాయక్ కు సమన్లు జారీ చేశారు.

ఇండియాలో మనీ లాండరింగ్, విద్వేష పూరిత ప్రసంగాలు తదితర అభియోగాలను ఎదుర్కొంటున్న జకీర్ నాయక్ మలేసియాలో గత మూడేళ్ల నుంచి తలదాచుకుంటున్నారు.

జకీర్ నాయక్ వ్యాఖ్యల నేపథ్యంలో మలేసియా హోంమంత్రి ముహియిద్దీన్ యాసిన్ మాట్లాడుతూ, ఆయన వ్యాఖ్యలు మత వివక్షను రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. తప్పుడు ప్రచారాలను చేయడం ద్వారా సున్నితమైన సమాజాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయని చెప్పారు. దేశంలోని శాంతిని, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా... వారిపై చర్యలు తీసుకునేందుకు తన శాఖ రెండో ఆలోచన కూడా చేయబోదని స్పష్టం చేశారు.

మలేసియాలోని జనాభాలో 60 శాతం మంది మాలే ప్రజలు ఉన్నారు. ఇతరుల్లో ఎక్కువగా చైనీలు, హిందువులు ఉన్నారు.

More Telugu News