Russia: రష్యాలో విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. పొలంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వీడియో వైరల్!

  • రష్యా రాజధాని మాస్కోలో ఘటన
  • ఉరల్ ఎయిర్ లైన్స్ విమానానికి తప్పిన ముప్పు
  • 23 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు

విమానం గాల్లో ఉండగా కుదుపులకు లోనైతేనే చాలామందికి పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది విమానాన్ని పక్షుల గుంపు ఢీకొంటే? కొన్ని పక్షులు ఇంజిన్ లోకి దూసుకెళ్లడంతో అది చెడిపోతే? ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ. ఇలాంటి అనుభవమే రష్యాలోని ప్రయాణికులకు ఎదురయింది. రష్యాలోని మాస్కో ఎయిర్ పోర్టు నుంచి  ఉరుల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్-321 విమానం 236 మంది ప్రయాణికులతో బయలుదేరింది.

ఈ విమానం క్రిమియాలోని సిమ్ ఫెరోపొల్ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంది. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ పక్షుల గుంపు అనుకోకుండా విమానం ముందు భాగాన్ని ఢీకొట్టింది. ఈ సందర్భంగా కొన్ని పక్షులు విమానం ఇంజిన్లలోకి దూసుకెళ్లడంతో దాని నుంచి పొగలు రావడం మొదలైంది. దీంతో అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని సమీపంలోని ఓ పొలంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా 23 మందికి గాయాలయ్యాయి. వీరిని అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

More Telugu News