Jammu And Kashmir: కశ్మీర్ నేత షా ఫైజల్ కు షాక్.. ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు!

  • టర్కీలోని ఇస్తాంబుల్ కు ఫైజల్ పయనం
  • శ్రీనగర్ కు తిప్పిపంపిన పోలీసులు
  • ఆర్టికల్ 370 రద్దుపై ఫైజల్ ఘాటు వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్ నేత, మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టర్కీలోని ఇస్తాంబుల్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఫైజల్ ను ఢిల్లీ ఎయిర్ పోర్టులో నిలిపివేశారు. అనంతరం శ్రీనగర్ కు తిప్పిపంపారు. 2009 సివిల్స్ పరీక్షలో షా ఫైజల్ టాప్ గా నిలిచారు. ఈ ఘనత సాధించిన తొలి కశ్మీరీగా రికార్డు సృష్టించారు. అయితే కొద్దిరోజులకే తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఫైజల్ జమ్మూ అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు.

అంతేకాకుండా జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేయడం, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని ఫైజల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈద్‌ సందర్భంగా ప్రతీ అవమానానికి బదులు తీర్చుకునే వరకు పండుగ జరుపుకోబోనని ప్రకటించారు.

‘‘కశ్మీర్‌లో రాజకీయ హక్కులను కాపాడుకునేందుకు సుస్థిర, అహింసాయుతమైన, దీర్ఘకాలపు రాజకీయ ఉద్యమం రావాల్సి ఉంది. ఆర్టికల్ 370 రద్దుతో ప్రధాన రాజకీయ పార్టీల నేతల హవా ముగిసిపోయింది. రాజ్యాంగవేత్తలు మాయమైపోయారు. ఇప్పుడు మిగిలినవారంతా  కేంద్రం చెప్పినట్లు తలాడించాలి. లేదా  వేర్పాటువాదులుగా ఉండిపోవాలి’ అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి చేరుకున్న ఫైజల్ ను పోలీసులు శ్రీనగర్ కు తిప్పిపంపారు.

More Telugu News