NATo: రష్యా మంత్రిని వెంటాడిన నాటో యుద్ధ విమానం... వెంటనే వచ్చి రక్షణనిచ్చిన ఫైటర్ జెట్లు!

  • నాటో విమానాన్ని చూసిన రాడార్లు
  • వెంటనే దూసుకెళ్లిన రష్యా ఫైటర్ జెట్లు
  • మంత్రిని క్షేమంగా మాస్కోకు చేర్చిన వైనం

రష్యా రక్షణ మంత్రి సెర్జి షోయిగు ప్రయాణిస్తున్న విమానాన్ని నాటోకు చెందిన యుద్ధ విమానం సమీపిస్తుండటాన్ని చూసిన రాడార్ల నిర్వహణా అధికారులు, వెంటనే ఫైటర్ జెట్లను అప్రమత్తం చేయడంతో, అవి దూసుకెళ్లి, తమ నేతను క్షేమంగా వెనక్కు తీసుకు వచ్చాయి. 'టాస్' న్యూస్ ఏజన్సీ వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం బాల్టిక్ సముద్రంలోని న్యూట్రల్ వాటర్స్ లో ఈ ఘటన జరిగింది. షోయిగు ప్రయాణించే విమానం బాల్టిక్ రీజియన్ లోని కలినింగ్రాడ్ ప్రాంతంలో ఉన్న వేళ, నాటో విమానం అత్యంత సమీపంలోకి వచ్చింది. ఈ ప్రాంతం పోలాండ్, లిథువేనియాకు సమీపంలో ఉన్నప్పటికీ, రష్యా ఫైటర్ జెట్లు ఆ విమానానికి రక్షణగా వెళ్లి, తిరిగి దాన్ని క్షేమంగా మాస్కోకు చేర్చాయి.

నాటో వినియోగంలో ఉన్న ఎఫ్-18 జెట్ సెర్గి షోయిగు విమానానికి దగ్గరగా వెళ్లిందని, రష్యాకు చెందిన ఎస్యూ-27లు దాన్ని దూరంగా తరిమేసేందుకు దూసుకెళ్లాయని అదే విమానంలో మంత్రితో పాటు ప్రయాణిస్తున్న 'టాస్' విలేకరి తన కథనంలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా 'టాస్' విడుదల చేసింది. దూరంగా నాటో యుద్ధ విమానం కనిపిస్తుండగా, దానికి, మంత్రి ప్రయాణిస్తున్న విమానానికి మధ్య రక్షణగా రష్యన్ జెట్ నిలిచినట్టు తెలుస్తోంది. కొత్త మిలిటరీ అకాడమీకి శంకుస్థాపన చేసేందుకు మంత్రి వెళుతున్న వేళ ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ఘటనపై నాటో ఇంకా అధికారికంగా స్పందించలేదు.

More Telugu News