Andhra Pradesh: చంద్రబాబును కాపాడుకోవాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉంది!: ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నాం
  • వరద భయంతో బాబు హైదరాబాద్ కు పారిపోయారు
  • ఉండవల్లిలో బాబు ఇంటిని సందర్శించిన మంగళగిరి ఎమ్మెల్యే

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తుండటంతో చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరుతోందని అన్నారు. దీంతో అక్కడి సిబ్బంది లారీలతో ఇసుక బస్తాలను తరలిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని లింగమనేని గెస్ట్ హౌస్ ను సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు.

లింగమనేని గెస్ట్ హౌస్ మునిగిపోతుందన్న భయంతోనే చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. కృష్ణా వరదను ముందే ఊహించిన చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు చెందిన వాహనాలను హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో సరైన వర్షాలు పడక, వరదలు రాలేదు కాబట్టే చంద్రబాబుకు ఇక్కడి పరిస్థితి అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో అయినా చంద్రబాబు తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేయక తప్పదని ఆర్కే స్పష్టం చేశారు.

More Telugu News