అసమాన ధైర్యసాహసాలకు ప్రతిఫలం... రేపు 'వీరచక్ర' పురస్కారాన్ని అందుకోనున్న అభినందన్

14-08-2019 Wed 11:40
  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభినందన్ కు సైనిక పురస్కారం
  • వీరచక్ర గ్యాలెంట్రీ మెడల్ తో సత్కరించనున్న ప్రభుత్వం
  • ప్రస్తుతం బయటకు వెల్లడించని ఎయిర్ బేస్ లో విధుల్లో ఉన్న అభినందన్
పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చి, పాక్ ఆర్మీ చెరలో దాదాపు 60 గంటలు బందీగా ఉండి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ అసమాన ధైర్యసాహసాలను భారత ప్రభుత్వం సమున్నత రీతిలో గౌరవించనుంది. రేపు, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభినందన్ ను 'వీరచక్ర' గ్యాలెంట్రీ మెడల్ తో సత్కరించనుంది.

ఫిబ్రవరి 27న పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చిన అభినందన్ ఆ తర్వాత పాక్ ఆర్మీ చేతికి చిక్కారు. ఆ తర్వాత ఎంతో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో పాక్ ఆర్మీ అధికారులకు ఆయన సమాధానాలు ఇచ్చిన వీడియా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. గంటల వ్యవధిలోనే అభినందన్ భారతదేశ హీరో అయిపోయారు. మార్చి 1న వాఘా సరిహద్దులో అడుగుపెట్టిన అభినందన్ కు భారత ప్రజలు జయజయ ధ్వానాలతో స్వాగతం పలికారు.

మరోవైపు, సెక్యూరిటీ కారణాల రీత్యా వెస్టర్న్ సెక్టార్ లో ఉన్న బయటకు వెల్లడించని ఓ ఎయిర్ ఫోర్స్ బేస్ లో అభినందన్ కు పోస్టింగ్ ఇచ్చారు. త్వరలోనే అభినందన్ తన సాధారణ విధులకు హాజరవుతారని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ధనోవా ఇటీవల తెలిపారు.