Delhi High Court: తమిళ్ రాకర్స్ ను బ్లాక్ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశం

  • పైరసీకి పాల్పడుతున్న తమిళ్ రాకర్స్!
  • తమిళ్ రాకర్స్ తో పాటు మరికొన్ని సైట్లపైనా చర్యలు
  • డొమైన్ రిజిస్ట్రేషన్లను కూడా తొలగించాలని కేంద్రానికి దిశానిర్దేశం

భారత్ లో అనేక ఫిలిం ఇండస్ట్రీలకు ప్రబల విరోధిగా మారిన వెబ్ సైట్ తమిళ్ రాకర్స్. వందల కోట్లు ఖర్చు పెట్టి భారీగా తీసిన చిత్రాలు సైతం విడుదల రోజునే పైరసీ బారినపడేయడంలో తమిళ్ రాకర్స్ కు అందెవేసిన చేయి. ముఖ్యంగా అనేక దక్షిణాది చిత్రాలు విడుదల రోజున, కొన్ని సందర్భాల్లో అంతకుముందే ఈ వెబ్ సైట్ లో ప్రత్యక్షమైన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, తమిళ్ రాకర్స్ ను బ్లాక్ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది.

తమిళ్ రాకర్స్ తో పాటు ఈజెడ్ టీవీ, కట్ మూవీస్, లైమ్ టొరెంట్స్ వంటి సైట్లను తాత్కాలికంగా నిలుపుదల చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయా సైట్ల యూఆర్ఎల్స్, ఐపీ అడ్రెస్ లను బ్లాక్ చేయాలని పేర్కొంది. అంతేకాకుండా, పలు నిర్మాణ సంస్థల కాపీరైట్లను ఉల్లంఘించాయంటూ వాటి డొమైన్ రిజిస్ట్రేషన్లను కూడా తొలగించాలంటూ కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు స్పష్టం చేసింది.

More Telugu News