Gorantla Madhav: రేయ్, మురళీధర్ రెడ్డి... ఇక్కడికి రారా!: ప్రాణ స్నేహితుడైన సీఐని చూడగానే ఎంపీ గోరంట్ల మాధవ్ ఆత్మీయ పిలుపు

  • వన మహోత్సవ సభలో ఆసక్తికర ఘటన
  • ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీ గోరంట్ల
  • అదే కార్యక్రమానికి బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ మురళీధర్
  • తన ప్రాణ స్నేహితుడు తనకు బందోబస్తు నిర్వహించడం ఏంటన్న గోరంట్ల

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రస్థానం ఎంతో ఆసక్తికరం. కదిరి  సీఐగా పనిచేసిన రోజుల్లో జేసీ దివాకర్ రెడ్డిపై మీసం తిప్పడమే కాదు, ఎన్నికల బరిలో దిగి తొలి ప్రయత్నంలోనే ఎంపీ అయ్యారు. అయితే, పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనా తన పోలీసు సహచరులను మాత్రం మర్చిపోలేదు. అందుకు ఈ సంఘటనే నిదర్శనం.

అనంతపురం పట్టణం రూరల్ పరిధిలోని కొడిమి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమానికి ఎంపీ హోదాలో గోరంట్ల మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ మరికాసేపట్లో ప్రారంభం అవుతుందనగా, ఎంపీ గోరంట్ల బిగ్గరగా అరిచారు. రేయ్, మురళీధర్... ఇక్కడికి రారా... అంటూ గట్టిగా పిలవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దగ్గరికి వచ్చిన మురళీధర్ రెడ్డిని హత్తుకున్న గోరంట్ల వేదికపై తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన, "నా ప్రాణస్నేహితుడివి నాకు బందోబస్తుగా రావడం ఏంటి? నా పక్కనే కూర్చో" అంటూ ఆప్యాయంగా ముచ్చటించారు. మురళీధర్ తో తన స్నేహానుబంధం ఇప్పటిది కాదని, 1998లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి తాము స్నేహితులుగా కొనసాగుతున్నామని వివరించారు. మురళీధర్ కు ఎన్నో ప్రమోషన్లు తప్పిపోయాయని, కానీ చాలా తెలివైనవాడు అని కితాబిచ్చారు. వన మహోత్సవ సభలో ఈ సన్నివేశం అందరి దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది.

More Telugu News