RIL AGM 2019: ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి ‘జియో ఫైబర్’ సేవలను ప్రారంభిస్తున్నాం!: ముఖేశ్ అంబానీ

  • సెటప్ బాక్సులను సరికొత్తగా మార్చాం
  • బ్రిటిష్ పెట్రోలియంతో జాయింట్ వెంచర్
  • 42వ ఏజీఎం భేటీలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్

2018లో అత్యధిక లాభాలు ఆర్జించిన సంస్థగా రిలయన్స్ రికార్డు సృష్టించిందని ఆ గ్రూపు చైర్మన్ ముఖేశ్ అంబానీ తెలిపారు. 2024 నాటికి భారత్ ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి తాము మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక మందగమనం తాత్కాలికమేననీ, భారత్ లో రాజకీయ వ్యవస్థ స్థిరంగా ఉన్నందున ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎదుగుతున్న భారత్ ను నిలువరించే శక్తి ప్రపంచంలో ఏ దేశానికీ లేదని స్పష్టం చేశారు. ఆఫీసులు, ఇళ్లకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు వీలుగా జియో ఫైబర్ నెట్  ను ఈ ఏడాది సెప్టెంబర్ 5 న ఆవిష్కరిస్తున్నామని ప్రకటించారు. అలాగే లోకల్ కేబుల్ ఆపరేటర్ల నుంచి సిగ్నల్స్ అందుకునేలా జియో సెటప్ బాక్సులను అభివృద్ధి చేశామని వెల్లడించారు. ముంబైలో ఈరోజు జరుగుతున్న 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన వాటాదార్లను ఉద్దేశించి ప్రసంగించారు.

రిలయన్స్ పెట్రోలింగ్ సంస్థతో, బ్రిటిష్ పెట్రోలియం(బీపీ) సంస్థ జాయింట్ వెంచర్ ప్రారంభించబోతోందని ముఖేశ్ అంబానీ తెలిపారు. ఇందులో భాగంగా తమ పెట్రో రిటైల్ విభాగంలో 49 శాతం వాటాను బ్రిటిష్ పెట్రోలియం సంస్థ కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఇందుకోసం బీపీ రూ.7,000 కోట్లను చెల్లిస్తోందని అన్నారు. కేజీ డీ6 బేసిన్ లో తాము రూ.35,000 కోట్ల పెట్టుబడులు పెట్టామనీ, ఇక్కడ 3 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయువును కనుగొన్నామని వెల్లడించారు.

ఇక్కడ వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి మొదలవుతుందని ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ఓసారి ఉత్పత్తి ప్రారంభం అయ్యాక గరిష్టంగా రోజుకు 1 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ను వెలికితీయగలమని తెలిపారు. ఇది భారత్ లో ప్రస్తుతం జరుగుతున్న గ్యాస్ ఉత్పత్తిలో 30 శాతమని వెల్లడించారు. 2030 నాటికి భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

More Telugu News