India: సెంచరీతో కదం తొక్కిన కోహ్లీ.. రెండో వన్డేలో భారత్ ఘన విజయం

  • నాలుగు వికెట్లు తీసిన భువీ
  • డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో విజయం
  • రికార్డు వన్డేలో ఉసూరుమనిపించిన గేల్

విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తొలి వన్డేను అడ్డుకున్న వర్షం రెండో వన్డేకూ కాసేపు అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయాన్ని అందుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది.

ఓపెనర్లు శిఖర్ ధవన్ (2), రోహిత్ శర్మ (18)లు నిరాశపరిచారు. పరుగుల యంత్రం కోహ్లీ తన మునుపటి ఆటతీరుతో అదరగొట్టాడు. వన్డేల్లో 42వ శతకం సాధించాడు. మొత్తం 125 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 14 ఫోర్లు, సిక్సర్‌తో 125 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ (20), శ్రేయాస్ అయ్యర్ 71, కేదార్ జాదవ్ 16, రవీంద్ర జడేజా 16 పరుగులు చేశారు.

అనంతరం 280 పరుగుల భారీ విజయ లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన విండీస్ ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ప్రారంభించింది. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి విండీస్ లక్ష్యాన్ని 270 పరుగులుగా నిర్దేశించారు. భారత బౌలర్ల దెబ్బకు విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీసి బెంబేలెత్తించాడు. దీంతో విండీస్ 42 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌటై పరాజయం పాలైంది. సెంచరీతో కదం తొక్కిన కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

కాగా, 300వ వన్డే ఆడుతున్న గేల్ ఈ మ్యాచ్‌లో మరోమారు నిరాశపరిచాడు. కేవలం 11 పరుగులకే అవుటయ్యాడు.  ఎవిన్ లూయిస్ 65, నికోలస్ పూరన్ 42 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మూడే వన్డే 14న జరగనుంది.

More Telugu News