Chiranjeevi: సినీ సంగీత కళాకారుల పరిస్థితి పట్ల చిరంజీవి ఆవేదన

  • హైదరాబాద్ లో సినీ సంగీత కళాకారుల యూనియన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్
  • ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి
  • టెక్నాలజీ రాకతో సంగీత కళాకారులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయన్న మెగాస్టార్

సినీ సంగీత కళాకారుల సంఘం తరఫున హైదరాబాద్ లో నిర్వహించిన స్వరసంగమం మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక పరిజ్ఞానం రాకతో లైవ్ రికార్డింగులు తగ్గిపోయాయని, దాంతో సంగీత కళాకారులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పుడు, ఏవీఎం, ప్రసాద్ స్టూడియోల్లో భారీ ఆర్కెస్ట్రాతో మ్యూజిక్ డైరెక్టర్లు లైవ్ రికార్డింగ్స్ చేపట్టేవారని, పెద్ద సంఖ్యలో సంగీత కళాకారులకు చేతినిండా పని ఉండేదని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.

అప్పట్లో ఆ విధమైన లైవ్ రికార్డింగులు చూడడం ఓ పండగలా ఉండేదని తెలిపారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ రాకతో లైవ్ రికార్డింగ్ లు తగ్గిపోయి, ఓ చిన్నగదిలో డిజిటల్ ఎక్విప్ మెంట్ సాయంతోనే మ్యూజికల్ ఎఫెక్ట్ లు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా ఎంతోమంది సంగీత వాద్య కళాకారులు ఉపాధి లేక ఇతర రంగాలకు వలసపోతున్నారని చిరంజీవి బాధను వ్యక్తం చేశారు. అలాంటివాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, తాను కూడా సాయం చేస్తానంటూ చిరు ముందుకు వచ్చారు.

More Telugu News