Peddapalli District: 'అమె వేధిస్తోంది' అంటూ లేఖరాసి ప్రభుత్వ ఉద్యోగి అదృశ్యం!

  • పెద్దపల్లి విద్యా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న రమేశ్
  • జీసీడీఓ పద్మ వేధిస్తోందని మరణవాంగ్మూలం
  • కేసును విచారిస్తున్న పోలీసులు

ఏడు నెలలుగా జీసీడీఓ తనను తీవ్రంగా వేధిస్తోందని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసిన పెద్దపల్లి జిల్లా విద్యా శాఖ కార్యాలయ డీఎల్ఎంటీ ఎనగందుల రమేశ్ శుక్రవారం నుంచి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఎయిటింక్లయిన్ కాలనీకి చెందిన రమేశ్, సర్వశిక్షా అభియాన్ విభాగంలో జిల్లా స్థాయి మానిటరింగ్ టీంలో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఒక బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్లిన అతను, గోదావరి ఖనికి చేరుకుని, వరుసకు సోదరుడయ్యే సతీశ్ దుకాణం వద్ద బ్యాగ్ పెట్టి, ఆపై అదృశ్యం అయ్యాడు.

సాయంత్రం వరకూ రాకపోవడం, అతని ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి వుండటంతో, ఆందోళనతో రమేశ్ సోదరుడు రాజు, అతని బావ రాజేందర్ లకు సతీశ్ విషయం చెప్పాడు. దీంతో రమేశ్ బ్యాగ్ ను ఓపెన్ చేసి చూడగా, మూడు పేజీల లేఖ లభించింది. 'మరణ వాంగ్మూలం' అంటూ ప్రారంభమైన లేఖలో, తన ఆఫీసులో జీసీడీఓగా పని చేస్తున్న పద్మ తనను వేధిస్తోందని వాపోయాడు. ఆఫీసులో ఖాళీగా ఉన్న సెక్టోరల్ ఆఫీసర్-1 పోస్ట్ ను తనకు దక్కుండా చేసిందని, అన్ని అర్హతలు ఉన్నా తనను ఎంపిక చేయలేదని ఆరోపించాడు. వెళ్లి అడిగితే, తిట్టారని, తన చావుకు ఆమే కారణమని తెలిపాడు. దీంతో వారు లేఖను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాఫ్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News