Gurmeet Ram Rahim: డేరా చీఫ్ గుర్మీత్‌కు ఎదురుదెబ్బ.. పెరోల్ ఇచ్చేందుకు నిరాకరణ

  • హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న గుర్మీత్ తల్లి
  • కుమారుడు వస్తే తప్ప వైద్యం చేయించుకోనంటున్న నసీబ్ కౌర్
  • పెరోల్ ఇవ్వడం సాద్యం కాదన్న రోహ్‌తక్ జైలు అధికారులు

డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్‌కు పెరోల్ ఇచ్చేందుకు రోహ్‌తక్ జైలు అధికారులు నిరాకరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు మూడు వారాల పెరోల్ కావాలంటూ డేరాబాబా చేసిన అభ్యర్థనను జైలు అధికారులు కొట్టివేశారు. తన ఆశ్రమంలో ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం రోహ్‌తక్‌లో అత్యంత కట్టుదిట్టమైన సునారియా జైలులో గుర్మీత్ శిక్ష అనుభవిస్తున్నాడు.  

డేరాబాబా భార్య హజ్రిత్ కౌర్ ఈ నెల 5న తన  భర్తకు పెరోల్ కోరుతూ పంజాబ్/హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. గుర్మీత్ సింగ్ తల్లి నసీబ్ కౌర్ (85) అనారోగ్యంతో బాధపడుతున్నారని, కుమారుడు వస్తే తప్ప చికిత్స చేయించుకోనని అంటున్నారని కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి గుర్మీత్‌కు పెరోల్ ఇప్పించాలని అభ్యర్థించారు.    

పిటిషన్‌ను విచారించిన కోర్టు హజ్రిత్ కౌర్ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, గుర్మీత్‌ను పెరోల్‌పై బయటకు పంపేందుకు జైలు అధికారులు నిరాకరించారు. ఇందుకు రెండు కారణాలు చూపారు. అందులో ఒకటి శాంతిభద్రతల సమస్య కాగా, రెండోది గుర్మీత్ తల్లి ఆరోగ్యానికి సంబంధించిన విషయమని తెలిపారు. ఆమె గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోందని వైద్యులు చెప్పారని, ప్రస్తుతానికి ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పినట్టు తెలిపారు. కాబట్టి గుర్మీత్‌కు పెరోల్‌ను నిరాకరిస్తున్నట్టు వివరించారు.

More Telugu News