Telugudesam: టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న అయ్యన్నపాత్రుడు

  • గుంటూరు పార్టీ ఆఫీసులో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
  • హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
  • ఎంతో శ్రమించినా ఓటమి పాలయ్యామంటూ అయ్యన్న ఆవేదన
ఎన్నికల్లో ఘోర పరాజయానికి దారితీసిన కారణాలను విశ్లేషించే పనిలో టీడీపీ అధినాయకత్వం తలమునకలుగా ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు లెక్కకు మిక్కిలిగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా పొలిట్ బ్యూరో సమావేశం జరిపారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి హాజరైన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఓ దశలో తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో శ్రమించినా ఫలితం లేకపోయిందంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఎన్నో ప్రజా సంక్షేమ పనులు చేపట్టామని, నేతలందరూ తీవ్రంగా కష్టించారని, అయినాగానీ ప్రజలు వైసీపీ పట్ల ఆకర్షితులవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన చంద్రబాబుతో పేర్కొన్నారు. ముఖ్యంగా, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు మూతపడిన స్థితిలో దర్శనమివ్వడాన్ని చూడలేకపోతున్నామంటూ అయ్యన్న కంటతడి పెట్టడం పార్టీ వర్గాలను కూడా కదిలించింది.
Telugudesam
Chandrababu
Ayyanna Patrudu

More Telugu News