samjhauta express: ఆఖరికి ఢిల్లీ చేరిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌!

  • ఈరోజు ఉదయం 8 గంటలకు దేశరాజధానికి
  • ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
  • నిన్న రైలును నిలిపివేసిన పాకిస్థాన్‌ అధికారులు

దాయాది దేశాలు భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య అనుసంధాన కర్తగా నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ఎట్టకేలకు వాఘా సరిహద్దుదాటి ఈరోజు ఉదయం 8 గంటలకు రాజధాని ఢిల్లీకి చేరుకుంది. దీంతో  రైలులో ప్రయాణిస్తున్న 117 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికుల్లో 48 మంది పాకిస్థానీలు కూడా ఉన్నారు. లాహోర్‌-ఢిల్లీ మధ్య వారానికి రెండు రోజులు (సోమవారం, గురువారం) నడిచే ఈ ఫ్రెండ్‌ షిప్‌ ట్రైన్‌ నిన్న ఎప్పటిలాగే 117 మంది ప్రయాణికులతో లాహోర్‌లో బయలుదేరింది. వాఘా స్టేషన్‌కు వచ్చాక రైలు సరిహద్దుదాటి భారత్‌ భూభాగంలోకి ప్రవేశించేందుకు పాకిస్థాన్ అధికారులు అనుమతించలేదు.

సాధారణంగా ఈ  రైలు వాఘా సరిహద్దుకు వచ్చేసరికి భారత్‌ అధికారులు మన భూభాగంలోని అటారీ స్టేషన్‌ నుంచి ఇంజిన్‌, సిబ్బందిని పంపిస్తారు. బోర్డర్‌ నుంచి మన సిబ్బంది ఆధ్వర్యంలో  రైలు ప్రయాణం సాగుతుంది. ఇందుకు పాకిస్థాన్‌ అధికారులు నిరాకరించడంతో కొన్ని గంటలపాటు సరిహద్దులోనే రైలు నిలిచిపోయింది. దీంతో కొన్ని గంటల పాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది. 

ఎట్టకేలకు అనుమతి లభించడంతో భారత్‌ అధికారులు అటారి స్టేషన్‌ నుంచి ఇంజిన్‌, సిబ్బందిని పంపి  రైలును అటారి స్టేషన్‌కు నిన్న రాత్రి తీసుకువచ్చారు. భద్రతాపరమైన తనిఖీల అనంతరం ఈరోజు తెల్లవారు జామున  రైలు ఢిల్లీకి బయలుదేరింది. దీంతో నాలుగున్నర గంటల ఆలస్యంతో ఈ ఉదయం 8 గంటలకు రైలు ఢిల్లీ చేరడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News