BRK Bhavan: తెలంగాణ సచివాలయం ఖాళీ... ఇక బీఆర్కే భవన్ నుంచి కార్యకలాపాలు!

  • పాత భవనాల స్థానంలో నూతన భవంతులు
  • బీఆర్కే భవన్ కు మారిపోయిన సచివాలయం
  • సీఎం కార్యాలయం మెట్రో రైల్ భవంతిలోకి

హైదరాబాద్ లో ప్రస్తుతమున్న తెలంగాణ సచివాలయ భవనాల స్థానంలో కొత్త భవంతులు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, సచివాలయాన్ని బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే) భవన్‌ కు మార్చే పనులు పూర్తయ్యాయి.

నేటి నుంచి బీఆర్కే భవన్ వేదికగా ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సచివాలయంలోని అన్ని ప్రధాన శాఖల తరలింపు పూర్తికాగా, శ్రావణ శుక్రవారం మంచిరోజు కావడంతో, నేటి నుంచి కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు బీఆర్కే భవన్ నుంచి పని ప్రారంభించనున్నారు. ఇంకా కొంత సామగ్రి తరలింపు మిగిలివుంది. రేపటి నుంచి మూడు రోజులు సెలవు వుండటంతో, ఈలోగా మొత్తం సామగ్రి తరలింపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

ఇప్పటికే బీఆర్కే భవన్ లో ప్రభుత్వ శాఖల కార్యాలయాలు సిద్ధం కాగా, ఫర్నీచర్‌ చేరిపోయింది. కార్యాలయాలను సూచించే బోర్డులను కూడా పెట్టారు. అధికారులకు పార్కింగ్ వసతి కల్పించారు. ప్రత్యేక భద్రతా దళం భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. ఇక ముఖ్యమంత్రి కార్యాలయం బేగంపేటలో ఉన్న మైట్రోరైలు కార్యాలయంలో కొనసాగనుంది.

More Telugu News