Malala Yousafzai: ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. నోబెల్ పురస్కార గ్రహీత మలాలా స్పందన

  • కశ్మీర్ లో హింస, ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉంది
  • కశ్మీరీల బాధ గురించి అంతర్జాతీయ సమాజం ఆలోచించాలి
  • మానవహక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలి

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం పాక్ జాతీయురాలు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ స్పందించారు. కశ్మీర్ లోని మహిళలు, చిన్నారుల పట్ల తాను ఆందోళన చెందుతున్నానని ఆమె ట్వీట్ చేశారు. 'నా చిన్నప్పటి నుంచి, మా తల్లిదండ్రులు చిన్నవారిగా ఉన్నప్పటి నుంచి, మా తాతలు యువకులుగా ఉన్నప్పటి నుంచి దశాబ్దాలుగా కశ్మీర్ ప్రజలు తీవ్ర సంఘర్షణను అనుభవిస్తూనే ఉన్నారు. దక్షిణాసియాకు చెందిన యువతిని కాబట్టి... నేను కశ్మీర్ గురించి తపనపడతాను' అని అన్నారు.

'కశ్మీర్ విభిన్న మతాలు, సంప్రదాయాలు, భాషలు, వంటకాల సముదాయం. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ హింస, ఘర్షణ చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కశ్మీరీ మహిళలు, చిన్నారుల గురించి ఆందోళన చెందుతున్నా. దక్షిణాసియా దేశాలు, అంతర్జాతీయ సమాజం అక్కడి ప్రజల బాధ గురించి ఆలోచించాలి. మానవహక్కుల పరిరక్షణకు అందరూ ప్రాధాన్యతను ఇవ్వాలి. ఏడు దశాబ్దాలుగా ఉన్న సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు యత్నించాలి' అని మలాలా వ్యాఖ్యానించారు.

మరోవైపు మలాలా వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు మండిపడుతున్నారు. నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నప్పటికీ... పాకిస్థాన్ కు వత్తాసు పలుకుతూ మలాలా మాట్లాడిందని... ఇది సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.

More Telugu News