Modi: మోదీకి ఇచ్చిన వినతిపత్రాన్ని ఎందుకు తొక్కిపెడుతున్నారు?: యనమల

  • వినతిపత్రంలో ఏముందో ప్రజలకు తెలియజేయాలి
  • వినతిపత్రం కాపీని మీడియాకు ఎందుకు ఇవ్వలేదు?
  • మీకు నచ్చిన అంశాలను మాత్రమే ప్రజలకు చెబుతారా?

ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 45 నిమిషాల సేపు వీరి సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా మోదీకి జగన్ వినతిపత్రాన్ని అందించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని మోదీని జగన్ కోరినట్టు సమాచారం.

మరోవైపు, జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. మోదీకి సమర్పించిన వినతిపత్రంలో ఏముందో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం కాపీని మీడియాకు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ప్రధానికి అందించిన వినతిపత్రంలో మీకు నచ్చిన అంశాలను మాత్రమే ప్రజలకు చెబుతారా? అని అడిగారు. ఓ వైపు తెలంగాణ ముఖ్యమంత్రితో అంటకాగుతున్నారని... మరోవైపు విభజన హామీలను నెరవేర్చాలని ప్రధానిని కోరుతున్నారని.... ఇదంతా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికే చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

కేంద్రం నిధులు ఇస్తేనే పోలవరం ప్రాజెక్టులో ఇటుక పెడతానని చెప్పడంలో అంతరార్థం ఏమని యనమల ప్రశ్నించారు. మీరు చేస్తున్న విచారణకు, కేంద్ర నిధులకు సంబంధం ఏమిటని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర మంత్రులు చెబుతుంటే... జగన్ కానీ, వైసీపీ ఎంపీలు కానీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమాన్ని ఆశించేవారైతే... ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నారని మండిపడ్డారు.

More Telugu News