Sushma Swaraj: సుష్మా స్వరాజ్ ఆఖరి ఫోన్... రూపాయి బాకీ చెల్లించేందుకు హరీశ్ సాల్వేకు ఆహ్వానం!

  • కులభూషణ్  జాదవ్ తరఫున వాదించిన సాల్వే
  • కేవలం రూపాయి ఫీజుకే వాదన
  • రూపాయి తీసుకెళ్లాలని నిన్న రాత్రి కోరిన సుష్మ
కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మృతి తనకెంతో దిగ్భ్రాంతిని కలిగించిందని, ఆమె మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే భావోద్వేగానికి గురయ్యారు. గుండెపోటు రావడానికి కొద్ది సేపటి క్రితం ఆమె తనకు ఫోన్ చేసి మాట్లాడారని ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన హరీశ్ సాల్వే గుర్తు చేసుకున్నారు. మీకు ఒక రూపాయి చెల్లించాల్సి వుందని, దాన్ని తీసుకునేందుకు బుధవారం నాడు తన ఇంటికి రావాలని ఆమె ఆహ్వానించారని సాల్వే తెలిపారు. ఆ విలువైన రూపాయి తనకు కావాల్సిందేనని, వస్తానని తాను బదులిచ్చానని చెప్పారు.  ఇంతలోనే ఆమె కానరాని లోకాలకు చేరిపోయిందని అన్నారు.

కాగా, అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషణ్ జాదవ్ తరఫున హరీశ్ సాల్వే వాదించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన కేవలం ఒక్క రూపాయి ఫీజును మాత్రమే తీసుకునేందుకు అంగీకరించారు. ఇంకా ఆయనకు రూపాయి అందలేదు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో సుష్మా స్వరాజ్ స్వయంగా సాల్వేకు ఫోన్ చేశారు. మీరు కేసు గెలిచారని గుర్తు చేస్తూ, ఒక్క రూపాయి ఫీజు ఇవ్వాలి, వచ్చి తీసుకెళ్లండన్నారు. ఇదే సంభాషణను గుర్తు చేసుకున్న సాల్వే కన్నీరు పెట్టుకున్నారు.
Sushma Swaraj
Harish Salve
One Rupee
Phone

More Telugu News