Krishna River: కృష్ణానదిలో అనూహ్యంగా రెట్టింపైన వరద... రేపు నాగార్జునసాగర్ కు నీటి విడుదల!

  • ఎగువన కొనసాగుతున్న వర్షాలు
  • కృష్ణమ్మకు అనూహ్యంగా పెరిగిన వరద
  • నికరంగా 2.40 లక్షల క్యూసెక్కుల నిల్వ
కృష్ణానదిలో అనూహ్యంగా వరద రెట్టింపైంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతుండగా, జూరాల మీదుగా నాలుగున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.

నిన్నటివరకూ రెండు లక్షల క్యూసెక్కులకు అటూఇటుగా సాగిన వరద నీటి ప్రవాహం రెట్టింపు కావడంతో, అధికారులు పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. దీంతో దాదాపు 80 వేల క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు చేరుతోంది. ఇదే వరద ప్రవాహం కొనసాగితే, రేపు సాయంత్రం లేదా శుక్రవారం నాడు శ్రీశైలం డ్యామ్ గేట్లను తెరవాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నికరంగా 2.40 లక్షల క్యూసెక్కుల నీరు నిల్వ అవుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, 871 అడుగులకు నీరు చేరుకుంది. దీంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నీటి విడుదల ప్రారంభమైంది. జలాశయంలో 215 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యముండగా, ప్రస్తుతం సుమారు 150 టీఎంసీల నీరుంది. ఇప్పుడున్న వరద కొనసాగితే, మధ్యాహ్నానికే నీరు క్రస్ట్ గేట్లను తాకి, కిందకు దూకేందుకు సిద్ధంగా ఉంటుంది.
Krishna River
Srisailam
Flood
Dam
Nagarjuna Sagar

More Telugu News