Jammu And Kashmir: మలేసియా, టర్కీ ప్రధానులతో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. భారత రాయబారికి పాక్ నోటీసులు

  • ఆర్టికల్ 370 రద్దుపై మండిపడుతున్న పాకిస్థాన్
  • నేడు అత్యవసరంగా సమావేశమవుతున్న పాక్ పార్లమెంటు
  • జమ్ముకశ్మీర్ అంశాలపై చర్చించనున్న నేతలు
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కశ్మీరీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా భారత్ వ్యవహరిస్తోందని మండిపడింది. ఈ నేపథ్యంలో, ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు పాకిస్థాన్ పార్లమెంటు ఉభయసభలు అత్యవసరంగా సమావేశం కాబోతున్నాయి. జమ్ముకశ్మీర్, నియంత్రణ రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

మరోవైపు, భారత్ నిర్ణయాలపై మలేసియా, టర్కీ దేశాల ప్రధానులతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్ లో మాట్లాడారు. భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారికి ఇమ్రాన్ తెలిపారు. ద్వైపాక్షిక చర్చలకు అవకాశం లేకుండా పోయే పరిస్థితి ఉందని అన్నారు. అయితే, కశ్మీరీల కోసం విలువలతో కూడిన రాజకీయాలను కొనసాగిస్తామని... దౌత్యపరంగా పోరాడుతామని చెప్పారు.

జమ్ముకశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనైతికం, చట్ట వ్యతిరేకమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన ద్వారా విమర్శించింది. భారత్ నిర్ణయంపై కౌంటర్ కు సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలిస్తామని తెలిపింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వివాదాస్పద ప్రదేశం కశ్మీర్ అని... ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి కలగజేసుకోవాలని కోరింది. మరోవైపు, పాకిస్థాన్ లోని భారత రాయబారి అజయ్ బిసారియాకు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జరీ చేస్తూ, నిరసన వ్యక్తం చేసింది.
Jammu And Kashmir
Pakistan
Imran Khan

More Telugu News