Prithvi Shaw: 'ఆర్టికల్ 370'పై ఐదేళ్ల క్రితమే ట్వీట్ చేసిన ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా అర్చర్.. ఫేక్ ట్వీట్ అంటున్న మరికొందరు

  • ఆర్టికల్ 370 ఏమంత సురక్షితం కాదని ట్వీట్
  • మోదీ తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజే ట్వీట్ చేసిన అర్చర్
  • ట్వీట్‌పై అనుమానాలు

ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా అర్చర్ పేరు ఇటీవల విపరీతంగా ఫేమస్ అయింది. క్రికెట్ విషయంలో అతడు ముందుగానే ఊహించి చేస్తున్న ట్వీట్లు నిజం కావడంతో అతడి ట్వీట్లకు విపరీతమైన క్రేజ్ లభించింది. ప్రపంచకప్ సమయంలో అతడు చెప్పినట్టే జరిగింది. అర్చర్ పేరు తాజాగా మరోమారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను కేంద్రం రద్దు చేసిన తర్వాత అర్చర్ పేరు మరోమారు సోషల్ మీడియాలో మారుమోగింది.

టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా  నిషేధాన్ని ఎదుర్కోబోతున్నాడని ముందే ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన అర్చర్.. ఐదేళ్ల క్రితమే ఆర్టికల్ 370 రద్దు కాబోతోందని ఊహించి చెప్పాడు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. 26 మే 2014న చేసినట్టుగా ఉన్న ఈ ట్వీట్‌లో ‘ఈ రోజుల్లో ఆర్టికల్ 370 ఏమంత సురక్షితం కాదు’ అని పేర్కొన్నాడు. నరేంద్రమోదీ అదే రోజు ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.

అర్చర్ ట్వీట్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతడు క్రికెటర్ కాదని, జోఫ్రా బాబా అంటూ కామెంట్లు చేస్తున్నారు.  అయితే, కొందరు మాత్రం ఈ ట్వీట్‌ను నమ్మొద్దని, ఫేక్ అని కొట్టిపడేస్తున్నారు. అది మార్ఫింగ్ చేసిన ట్వీట్ అని, వేరే ఖాతా నుంచి అది పోస్ట్ అయిందని చెబుతున్నారు. దీంతో అది నిజమో? అబద్ధమో తెలియక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.  

More Telugu News