Pakistan: ఆర్టికల్ 370 రద్దుపై ఘాటుగా స్పందించిన పాకిస్థాన్

  • ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఖండించిన పాక్ విదేశాంగ శాఖ
  • ఈ నిర్ణయంతో కశ్మీర్ వివాదం సమసిపోదని వ్యాఖ్య
  • 'భారత్ ఆక్రమిత జమ్మూకశ్మీర్' అంటూ ప్రకటనలో పేర్కొన్న పాకిస్థాన్

జమ్మూకశ్మీర్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ దశాబ్దాల నాటి ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం సంచలనం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై పాకిస్థాన్ మండిపడుతోంది. భారత సర్కారు జమ్మూకశ్మీర్ విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కశ్మీర్ వివాదం రగులుతూనే ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం అక్రమం అని ఘోషిస్తున్న పాక్ విదేశాంగ శాఖ, ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై సవాల్ చేస్తామని తెలిపింది.

"భారత్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ విషయంలో అక్కడి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం, తిరస్కరిస్తున్నాం. భారత అధీనంలో ఉన్న ఆ ప్రాంతం వివాదాస్పద ప్రాంతమని అంతర్జాతీయంగా అందరికీ తెలిసిందే. ఈ వివాద స్థితిని భారత ప్రభుత్వం తీసుకున్న ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు మార్చలేవు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాల దృష్ట్యా ఇది జమ్మూకశ్మీర్ ప్రజలకు, పాకిస్థాన్ కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. భారత్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ ప్రజల రాజకీయ, దౌత్య హక్కులను కాపాడేందుకు పాక్ కట్టుబడి ఉంది" అంటూ ఓ ప్రకటన చేశారు.

  • Loading...

More Telugu News