Saini: తీసిన తొలి వికెట్ కే ఐసీసీ ఆగ్రహానికి గురైన టీమిండియా పేసర్ సైనీ

  • విండీస్ తో తొలి టి20లో పూరన్ వికెట్ తీసిన సైనీ
  • రెచ్చిపోయి సంబరాలు చేసుకున్న వైనం
  • పూరన్ దిశగా రెచ్చగొట్టే సంజ్ఞలు

టీమిండియాలో అడుగుపెట్టిన కొత్త ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ వచ్చీ రావడంతోనే ఐసీసీ కంట్లో పడ్డాడు. వెస్టిండీస్ తో తొలి టి20 మ్యాచ్ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన నేపథ్యంలో ఐసీసీ మందలించింది. విండీస్ ఆటగాడు నికొలాస్ పూరన్ వికెట్ తీసిన ఆనందంలో సైనీ రెచ్చిపోయి ప్రవర్తించాడు. పూరన్ దిశగా దూకుడుతో కూడిన సంజ్ఞలు చేశాడు. సైనీ అంతర్జాతీయ కెరీర్ లో ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. అంతకుముందు సైనీ బౌలింగ్ లోనే పూరన్ ఓ స్ట్రెయిట్ సిక్స్ కొట్టాడు. దాంతో కసిగా బౌలింగ్ చేసిన సైనీ కీపర్ క్యాచ్ ద్వారా పూరన్ అవుట్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు.

వికెట్ పడిన ఆనందంలో సైనీ సంబరాలు కాస్త శ్రుతి మించాయని ఐసీసీ భావించింది. అయితే, తన తప్పును సైనీ ఒప్పుకోవడంతో ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.5 కింద లెవల్ 1 తప్పిదంగా భావించి మందలింపుతో సరిపెట్టారు. అంతేకాకుండా, ఒక డీమెరిట్ పాయింట్ ను సైనీ ఖాతాలో వేశారు. మరో డీమెరిట్ పాయింట్ వస్తే ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

More Telugu News