Andhra Pradesh: ఏపీ పీసీసీ చీఫ్ గా పళ్లంరాజు నియామకం?

  • గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పళ్లంరాజు
  • కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా నిలిచిన కుటుంబం
  • పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న రఘువీరా

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజును నియమిస్తున్నట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడి పదవికి ఇటీవల రఘువీరా రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో పళ్లంరాజును నియమించడానికి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 1962, ఆగస్టు 31న డా.ఎం.ఎస్.సంజీవరావు, రామరాజేశ్వరి దంపతులకు పళ్లంరాజు జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బీఈ, ఎంబీఏ పట్టాలు అందుకున్నారు. 1989, ఫిబ్రవరి 15న మమతతో ఆయన వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మల్లిపూడి మంగపతి పళ్లంరాజు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయులుగా పేరుంది. పళ్లంరాజు తండ్రి సంజీవరావు కూడా మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. తండ్రిబాటలోనే నడిచిన పళ్లంరాజు పీసీసీ కమిటీ సభ్యుడిగా, ఏఐసీసీ సభ్యుడిగా పనిచేశారు. 1989లో లోక్ సభ ఎన్నికల్లో కాకినాడ సీటు నుంచి పోటీచేసి గెలుపొందారు.

2004 ఎన్నికల్లో మరోసారి లోక్ సభకు కాకినాడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో 2006 నుంచి 2009 వరకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఏపీ విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అంతర్థానమైపోయిన నేపథ్యంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యతను హైకమాండ్ పళ్లంరాజుకు అప్పగించనుంది.

More Telugu News