Andhra Pradesh: దూరదృష్టి, ప్లానింగ్ లో చంద్రబాబు దిట్ట.. కానీ ఇప్పుడాయన రిటైర్మెంట్ స్టేజీకి వచ్చేశారు!: రావెల కిశోర్ బాబు

  • ఏపీలో ఇప్పుడు నాయకత్వ లేమి కనిపిస్తోంది
  • టీడీపీ, వైసీపీ నుంచి బీజేపీలోకి వలసలు ఉంటాయి
  • చంద్రబాబుపై ప్రజలకు విశ్వాసం తగ్గిపోతోంది

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నాయకత్వలేమి అన్నది స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ నేత రావెల కిశోర్ బాబు తెలిపారు. టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రిటైర్మెంట్ స్టేజ్ కి వచ్చేశారని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో రావెల మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు వయసైపోయింది. ఇక పార్టీని ముందుకు తీసుకెళ్లలేడు. అప్పుడప్పుడు కొన్ని విషయాలను ఆయన మర్చిపోతున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్, ఆయన చుట్టూ ఉన్నవారు చంద్రబాబును తప్పుదారి పట్టిస్తున్నారు.

దూరదృష్టి, ప్లానింగ్, వ్యూహరచనలో చంద్రబాబు ఒకప్పుడు చాలా బలంగా ఉండేవాడు. పార్టీని, ప్రభుత్వాన్ని నియంత్రించేవాడు. ఇప్పుడాయన ఆ పట్టు కోల్పోతున్నారు. దీంతో ఆయనపై విశ్వాసం తగ్గిపోతోంది. ఇక కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని సరిగ్గా గాడిలో పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిన పరిస్థితి.

ఆర్థికంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. చంద్రబాబు, జగన్ ల కంటే సుస్థిరమైన పాలనను బీజేపీ అందిస్తుంది. టీడీపీతో పాటు వైసీపీ నుంచి కూడా బీజేపీలోకి వలసలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై దేశవ్యాప్తంగా ప్రజలు విశ్వాసం ఉంచుతున్నారని చెప్పారు.

More Telugu News