krishna river: 9న కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం...నీటి పంపకాలపై చర్చ

  • టెలిమెట్రీల ఏర్పాటు ప్రధానం
  • అమరావతిలో కార్యాలయం ఏర్పాటుపైనా చర్చ
  • పాల్గొననున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, చీఫ్‌ ఇంజనీర్లు

ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలోకి వరద నీరు వచ్చి పడుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీటి పంపకం విషయమై చర్చించేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈనెల 9వ తేదీన నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శులు, చీఫ్‌ ఇంజనీర్లు భేటీ కానున్నారు.

నీటి పంపకంతోపాటు టెలిమెట్రీల ఏర్పాటు, అమరావతిలో కార్యాలయం తదితర అంశాలపైనా చర్చించనున్నారు. రెండో దశ టెలిమెట్రీల ఏర్పాటుకు నిధుల విడుదల అంశం, బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌ ఎజెండాలో ఉన్నాయి. పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించాలి. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపైనా చర్చించనున్నారు.

నదిలోకి ప్రవాహం వచ్చిన వెంటనే నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేస్తున్నారని, అలా కాకుండా నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ బోర్డును కోరారు. అలాగే పోలవరం, పట్టిసీమ ద్వారా మళ్లించే నీటిలో వాటా, సాగర్‌ ఎడమ కాలువ కింద ఆవిరయ్యే నీటి శాతం, ఆర్డీఎస్‌ ఆధునికీకరణకు ఆంధ్రప్రదేశ్‌ సహకరించకపోవడం అంశాలను ఎజెండాలో చేర్చాలని కూడా  కోరింది.

More Telugu News